ఆస్కార్... ఈ పేరు చెబితే చాలు... సినీ ప్రపంచం అంతా ఒక్కసారిగా పులకించిపోతుంది. హాలీవుడ్... బాలీవుడ్... టాలీవుడ్... అదీ ఇదీ అని లేదు. ఏ 'ఉడ్'లో అయినా ఇదో కల. నటుడు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు… ఇలా రంగుల లోకంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒక్కసారన్నా దీన్ని ముద్దాడాలన్నది జీవిత కాల కోరిక. స్టారాది స్టారుడైనా... గ్రేటాది గ్రేటుడైనా ఇదంటే 'పిచ్చి'.
ఎందుకంత? ఏముందని ఇంత? అమెరికాలో పుట్టి... హాలీవుడ్లో పెరిగి... విశ్వ సినీ జగత్తులో యోధానుయోధుల చేత సలాం కొట్టించుకొంటున్న ఆ ఆస్కార్ గొప్పేంటి? మార్చిలో జరగనున్న 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆస్కార్ గురించిన పూర్తి సమాచారం.... మూవీ మిర్రర్ లో చూద్దాం.
1927 వ సంవత్సరంలో ఎంజీఎం స్టూడియో చీఫ్ లూయిస్ బి మేయర్ ఇంట్లో ఒక రోజు రాత్రి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో సినీ ప్రముఖులు కూర్చొని మాట్లాడుకుంటూ సినీ పరిశ్రమకు ఉపయోగపడేలా తమ వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను లూయిస్ , నటుడు కోన్రాడ్ నాజెల్, దర్శకుడు ఫ్రెడ్ నిబ్లో, నిర్మాత ఫ్రెడ్ బీట్సన్ లకు తెలియజేశారు. దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి జనవరి 11, 1927న లాస్ఏంజిల్స్ లో అంబాసిడర్ హెూటల్లో జరిగిన మరో సమావేశంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరో 36 మందితో కలిసి దీనిపై లోతుగా ఆలోచించారు. మహామహులు మేయర్, మేరీ పిక్ఫోర్డ్, సిడ్ గ్రౌమన్, జెస్సీ లాస్కీ, జార్జ్ కోహెన్, సిసిల్ బి డిమెల్లీ, డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, సెడ్రిక్ గిబ్బన్స్, ఐర్వింగ్ తాల్బెర్గ్ ఈ కలయికకు హాజరై... ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు ప్రాణం పోశారు. కొంతకాలానికి 'ఇంటర్నేషనల్'ను తొలగించి డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
వ్యాపార దృక్పథం లేని సంస్థగా ప్రభుత్వం దీనికి గుర్తింపునిచ్చింది. 1927 మే 11న సంస్థ అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇందులో మొదటి గౌరవ సభ్యత్వాన్ని థామస్ ఎడిసన్ కు ఇచ్చింది. ఆరంభంలో నిర్మాతలు, నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణుల విభాగాలు మాత్రమే ఉండేవి. అకాడమీ ఆస్కార్ తో పాటు 8 రకాల అవార్డులను అందిస్తుంది. వాటిల్లో ఐర్వింగ్ జీ తాల్బెర్గ్ మెమోరియల్ అవార్డు,
జీన్ హర్షెట్ హ్యూమానిటేరియన్ అవార్డు,
గోర్డన్ ఈ సాయర్ అవార్డు,
అకాడమీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డు,
అకాడమీ టెక్నికల్ అచీవ్మెంట్, జాన్ ఏ బోనర్ మెడల్ ఆఫ్ కమాండేషన్, స్టూడెంట్ అకాడమీ అవార్డు ఉన్నాయి.
ఆస్కార్ లోగో చూడగానే ముచ్చటేస్తుంది కద. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎవరికైనా ఒకసారి ముద్దాడలనిపిస్తుంది. సినీ ప్రియులందరినీ ఆకర్శించే ఈ డిజైన్ రూపకల్పనకు ఓ ఆసక్తికర కథే వుంది.
1928లో ఎంజీఎం ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ ఆస్కార్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు... ఒక మోడల్ కావాల్సి వచ్చింది. అతనికి కాబోయే భార్య డాలర్స్ డెల్ రియో , దర్శకుడు, నటుడు అయిన ఎమిలియో ఎల్ ఉయడియో ఫెర్నాండెజ్న గిబ్సన్ కు పరిచయం చేసింది. విషయమేమంటే... ఆస్కార్ కు ప్రాణం పోయడానికి ఫెర్నాండజ్ ను నగ్నంగా ఫోజిమ్మని గిబ్జన్ అడిగాడు. అందుకు మొదట ససేమిరా అన్నా తర్వాత… గిబ్సన్ అభ్యర్థనతో సరే అనక తప్పలేదు. ఆ ఫేజే ఇప్పుడున్న ఆస్కార్ ప్రతిమ.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మెటల్ కొరత కారణంగా మూడేళ్ల పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ప్రతిమలు తయారు చేసి ఇచ్చారు. యుద్ధం ముగిసాక వాటి స్థానంలో బంగారం వి అందించారు.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన , బంగారంతో రూపొందిన ఆస్కార్ ప్రతిమను అమ్మడానికి ఎంత మాత్రం వీలు లేదు. విజేతలు గానీ, వారి వారసులు గానీ ఆస్కార్ ప్రతిమను అమ్మాలనే ఆలోచన వస్తే ముందు గా అకాడమీకే ఒక డాలరుకు అమ్మాలి.
ఇందుకు ఒప్పుకోకపోతే అకాడమీకి ప్రతిమను వెనక్కు తీసుకొనే అధికారం ఉంది. అయితే... ఈ నిబంధన ,విక్రయాలను ఆపలేకపోతోంది. పెద్ద మొత్తాలకు వేలం పాటల్లో వీటి విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. 1941లో బెస్ట్ స్క్రీన్ ప్లేకి ఆస్కార్ పొందిన ఆర్సన్ వెల్లెస్ తన అవార్డును (డిసెంబర్ 2011) వేలానికి పెట్టాడు. దీన్ని వేలం వేసేందుకు అనుమతి పొందుతూ అతని వారసులు కోర్టు కేసు గెలిచారు. ఈ ఆన్లైన్ వేలంలో ఇది ఏకంగా 8,61,542 అమెరికన్ డాలర్లుపలికింది.
ఆస్కార్ సినిమాలను ఎలా ఎంపిక చేస్తారు? ఎవరు ఎంపిక చేస్తారు? దీని వెనుక సపరేటుగా ఏదైనా ప్రాసెస్ వుందా అంటే? అన్నీ పకడ్బందీగా జరుగుతాయని తెలుస్తోంది.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో దాదాపుగా 7500 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటింగ్ విధానాన్ని మెయిల్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాల కింద ఓటర్లను విభజిస్తారు. అందరికంటే నటుల విభాగంలో ఎక్కువగా... 1,311 మంది ఓటర్లు ఉన్నారు. 73 ఏళ్లుగా వీరి ఓట్లను 'ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్' ఆడిటింగ్ సంస్థ పరిశీలించి, ఆమోద ముద్ర వేస్తోంది.
ఓటింగ్...: విదానాన్ని పరిశీలిస్తే ప్రతి డిసెంబర్లో అర్హత ఉన్న సినిమా కేటగిరీల లిస్టును సభ్యులందరికీ పంపిస్తారు. ఎక్కువ విభాగాల్లో ప్రతి సభ్యుడూ తనకు సంబంధించిన కేటగిరీవారికే ఓటు వేయాలి. ఉదాహరణకు... సభ్యుడైన నటుడు నటుడికి... దర్శకుడు దర్శకుడికి మాత్రమే ఓటు వేయాలి. వీరి ఓటింగ్ను బట్టి ఆయా విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తారు. విదేశీ చిత్రం అయితే తప్పకుండా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాలి. ఒక్కో దేశం నుంచి ఒక్క చిత్రాన్ని మాత్రమే పంపాల్సి వుంటుంది.
మరి ఇండియా నుంచి ‘చల్లో షో’ సెలక్టె అయ్యింది కద… RRR నామినేషన్స్ లోకి ఎలా ఎంపికైంది అనేది ఇప్పుడు చాలా మందిలో వున్న ప్రశ్న. ప్రభుత్వం తరపున పంపే సినిమా ఒకటి వుంటుంది. కానీ ఒకటిన్నర నెల ముందు సినిమాను లాస్ ఏంజిల్స్ లో విడుదల చేస్తే డైరెక్ట్ గా ఆస్కార్ కు పంపించుకునే వీలుంటుంది. కానీ దానికి తగిన ప్రమోషన్స్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. RRR సినిమా అమెరికాలో తెలుగులో విడుదలయినా… అమెరికన్లు చూసి వుండరు కాబట్టి రాజమౌళి టీమ్ అక్కడే వుండి సరైన ప్రమోటర్ ను వెదకి పట్టుకొని అక్కడ ప్రమోషన్ కోసం దాదాపు వందకోట్ల దాకా ఖర్చు పెట్టి వుండచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అకాడమీ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు తరలివస్తారు. విభిన్న డ్రెస్సుల్లో అభిమానులను అలరిస్తుంటారు సినీ ప్రముఖులు. ఇంత పెద్ద పండగను ప్రత్యక్షంగా చూసేందుకు బుల్లి తెరకు కోట్లాదిమంది అతుక్కుపోతారు. దీనికి ఆదరణ అంతకంతకూ
పెరుగుతూ పోతోంది. 70వ అకాడమీ అవార్డుల వేడుకను (1998) 57.25 మిలియన్ల మంది వీక్షించారు. ఆ ఏడాదే టైటానిక్ విడుదలైంది. అన్నింటికంటే ఎక్కువగా 1970 ఏప్రిల్లో జరిగిన 42వ అకాడమీ అవార్డుల వేడుకను రికార్డు స్థాయిలో 43.4 శాతం మంది వీక్షించారు. ఇప్పటి వరకు అతి తక్కువగా (31.76 మిలియన్లు) వీక్షించింది 80వ వేడుక.
వేదిక గురించి చెప్పుకుంటే …. ఇంత పెద్ద ఈవెంట్కు సరైన వేదికను ఎంచుకోవడం కూడా కష్టమే. మొట్టమొదటి వేడుక 1929లో హాలీవుడ్ రూస్వెల్ట్ హెూటల్లో జరిగింది. ఆ తరువాత నుంచి 1943 వరకు ఒక ఏడు అంబాసిడర్ హెూటల్ (విల్షర్ బౌలెవార్డ్)లో... మరో ఏడు బిల్ట్మర్ హెూటల్ (లాస్ఏంజిల్స్)లో నిర్వహించేవారు. తరువాత మూడేళ్లు హాలీవుడ్ గ్రౌమాన్స్ చైనీస్ థియేటర్లో... లాస్ఏంజిల్స్ షైన్ ఆడిటోరియంలో రెండేళ్లు జరిగాయి. 1949లో అకాడమీ ప్రధాన కార్యాలయం ఉన్న మెట్రోజ్ అవెన్యూ (హాలీవుడ్)లో నిర్వహించారు. 1950-60 వరకు హాలీవుడ్ పాన్లేజస్ థియేటర్ లో జరిపారు. టెలివిజన్ రంగంలోకి వచ్చాక... 1953-57 అవార్డుల ప్రదానోత్సవం వరుసగా హాలీవుడ్, న్యూయార్క్ ల్లోని న్యూయార్క్ లోని ఎల్బీసీ ఇంటర్నేషనల్ థియేటర్, ఎన్బీసీ సెంచరీ థియేటర్స్లో జరిగాయి. కొన్ని వేడుకలు లాస్ఏంజిల్స్లో నిర్వహించినా... తరువాత కాలిఫోర్నియాలోని శాంతా మోనిక సివిక్ ఆడిటోరియం కు మార్చారు. 1969లో మళ్లీ లాస్ఏంజిల్స్కు మారింది. 2002 లో కొడాక్ థియేటర్ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి శాశ్వత వేదికయింది. 2012 ఫిబ్రవరి ఆరంభంలో ఆస్కార్ వేడుకకు ముందు కొడాక్ థియేటర్ దివాలా తీయడంతో... హాలీవుడ్ అండ్ హైలాండ్ సెంటర్ గా పేరు మారింది. 2012 మే లో డోల్భీ లేబొరేటరీస్ హక్కులు సొంతం చేసుకున్నాక థియేటర్ పేరు మరోసారి మారి డోల్బీ థియేటర్ గా ప్రసిద్ధికెక్కింది.
Social Plugin