దైనందిక చర్యలో బిజీ బిజీగా ఉండే మనుషులకు ప్రస్తుతం సినిమాలు, టి.విలు, ఇంటర్నెట్, ఇలా ఎన్నో రకాల వినోదసాధనాలు ప్రస్తుతం మార్కెట్లో వున్నాయి. అలాంటి సందర్భంలో తొలిచూపుతోనే వారి మైండ్ స్పేస్ లీజుకు తీసుకొని సినిమా చూడాలనే తపనను వారి వారి మైండ్ లో చొప్పించే అస్త్రం 'సినిమా పోస్టర్'. అంతటి పవర్ వున్న పోస్టర్‌ను ఎలా డిజైన్ చేయాలి అనే అంశం ఈ వారం సినిమా రిపోర్టర్ చర్చిస్తోంది. ఒక పోస్టర్ వల్ల యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. ఒకే ఒక పోస్టర్ వల్ల ఎన్నో తిరుగుబాటులు, సమ్మెలు జరిగిన సందర్బాలూ వున్నాయి. అంతటి సమ్మోహనాశక్తి వున్న పోస్టర్‌ను క్రియేట్ చెయ్యడానికి ఎంత శ్రమపడాలి? ఎంతగా ఆలోచించాలి? అనే విషయాన్ని ప్రస్తుత దర్శక, నిర్మాతలు సీరియస్ గా తీసుకోవటం లేదు. ఏవో నాలుగు స్టిల్స్ తీసుకొని మన దృష్టిలో పోస్టర్ చూడటానికి బాగుంది అనిపించుకుంటే చాలనేది చాలా మంది భావన. కానీ మీకు నచ్చిన సినిమా పోస్టర్ ఇంకొకరికి నచ్చుతుందా? అనేది మా ప్రశ్న.
సినిమా నిర్మాణానికి ముందు స్టోరీబోర్డ్, విజువల్ డిజైన్స్, ప్లానింగ్ అంటూ ఎలాంటి ప్రక్రియలున్నాయో, పోస్టర్ డిజైనింగ్ కు కూడా అలాంటి ప్రక్రియలు చాలానే వున్నాయి. ముందుగా విజువల్ డిజైనర్ సినిమా కాన్సెప్ట్ మొత్తం విని ఆ కాన్సెప్ట్ ను సినిమా పోస్టర్ లో ఎలా ప్రతిబింబించేలా చెయ్యాలి అని ఆలోచించాలి. కాన్సెప్ట్ తొలి చూపులోనే ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తుందా? అనే విషయాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు ఒక ఫ్యాక్షన్ కాన్సెప్ట్ తో వున్న సినిమాకు ప్రస్తుతం ప్రేమకథా చిత్రాలకు ట్రెండ్ నడుస్తోందని, ప్రేమ సన్నివేశాలున్న డిజైన్స్ చేయటం వలన చాలా నష్టపోవాల్సి ఉంటుంది. సినిమా ప్రారంభానికి ముందే పోస్టర్లు ఎలా వుండాలి? సినిమాను హైప్ చెయ్యడానికి ఏ విషయాలు దోహదపడతాయి అని ఆలోచించినప్పుడే పబ్లిక్ లోకి ఆ సినిమా తాలుకు అంశాలు కరెక్టుగా చేరతాయి. పబ్లిసిటీకి కేటాయించిన బడ్జెట్ కంటే అధికంగా ప్రమోషన్ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను హైప్ చెయ్యడానికి పత్రికలు, యూటూబ్, ఫేస్ బుక్ ఇలా చాలా మాధ్యమాల్లో ఆ సినిమా గురించిన అంశాలు అదరగొట్టడం వల్ల ఆ సినిమాకు హైప్ క్రియేట్ అవుతుంది. అలా హైప్ చెయ్యడానికి ముఖ్యమైన అంశం ఆ సినిమాలో ఏముంది? అనేది స్క్రిప్ట్ కు ముందే గ్రహించాల్సిన అవసరం ప్రస్తుతం చాలా ముఖ్యం. కొత్త వాళ్లతో నిర్మిస్తున్న సినిమాలకు కనీసం యాభై లక్షలు పబ్లిసిటీకి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అవుతున్నాయి. లేదంటే ఆ సినిమాకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ప్రేక్షకులకు తెలీటం లేదు. అడపా, దడపా, ఆలాంటి సినిమాల ట్రైలర్స్ టి.వి.లో వచ్చినా గుర్తుంచుకునే పొజిషన్లో ప్రేక్షకులు లేరు. వారిని ఆకర్శించడానికి ఏదైనా కొత్తగా వుండాలి. ఈ పాయింట్ సినిమా ప్రారంభానికి ముందు ఎంచుకోవడం ముఖ్యం. తెలుగులో ఉదాహరణలుగా 'ఒక రొమాంటిక్ క్రైం స్టోరీ, 'అవును' చిత్రాలను తీసుకోవచ్చు. ఈ సినిమాలకు ఒకే పోస్టర్లో ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించారు.
టీజర్ పోస్టర్లు లేదా అడ్వాన్స్డ్ పోస్టర్లు:
ఇటీవలి కాలంలో టీజర్స్, ఫస్టులుక్, చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈమధ్య ' ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల టీజర్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్ పోస్టర్లను సినిమా ప్రారంభంలో హైప్ క్రియేట్ చెయ్యడానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం సినిమా పూర్తయ్యాక సినిమా ప్రమోషన్ ప్రారంభంలో టీజర్‌ను విడుదల చేస్తున్నారు. టీజర్ పోస్టర్ తయారీలో కాన్సెప్ట్ మాత్రమే ఎలివేట్ అయ్యేలా ఉంటుంది. కాన్సెప్ట్ తో పాటు చిన్న ట్యాగ్, టైటిల్ మాత్రమే ఉంటూ ప్రేక్షకులను సినిమాను చూడాలి అనే ఉత్సుకత కలిగించేలా టీజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటూ హాలీవుడ్ పోస్టర్ డిజైనర్ రెనాల్ట్ బ్రౌన్ ఒక సందర్భంలో రాశారు. టీజర్ పోస్టర్ లో సినిమాకు సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా జాగ్రత్తపడాలి. కథ, థీమ్, ఆర్టిస్టులను ముందే పోస్టర్ లో ఎలివేట్ చేయకుండా ఉంటే కేరెక్టర్ పోస్టర్స్ మళ్లీ విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వల్ల హైప్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంటుంది క్యారెక్టర్ పోస్టర్స్: ఈ పోస్టర్లను హైప్ క్రియేట్ చెయ్యడానికి వాడతారు. టీజర్ పోస్టు కు వచ్చిన రెస్పాన్ను ఇంకాస్త మెరుగుపరచడానికి కేరెక్టర్ పోస్టర్‌ను విడుదలచేస్తే బాగుంటుంది. కేరెక్టర్ గెటప్స్, పేరు, ఒక్కో కేరెక్టర్ భావాలు ఎలా వుంటాయి. వాటి తీరు తెన్నులను తెలియజేస్తూ కూడా పోస్టర్ ను విడుదల చేయవచ్చు. అది ఆ కేరెక్టర్ ను ఎలివేట్ చేసేలా ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా వుంది. బాహుబలి సినిమాకు ఇదే స్కీమ్ ను వాడారు. ప్రతి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేశారు.
పాపులర్ స్టైల్ సింబాలిజమ్: -
ఒక ఇమేజ్ ను పోస్టర్ లో పడేసేకంటే దానికి కాస్త రంగులు జోడించి కాస్త కాన్సెప్ట్ ను జతపరిస్తే అలాంటి పోస్టర్లు మరికొంతమందిని ఆకట్టుకునే అవకాశం ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో కొద్దిపాటి డిజైనను యాడ్ చేస్తే అది గ్రేట్ లుక్ ను సొంతం చేసుకొని చూపరులను ఇట్టే ఆకర్శిస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలను ఇవ్వడం జరిగింది. అందులో దాగివున్న సింబాలిజమ్ లను కూడా గమనించవచ్చు. ఆకట్టుకునే కొన్ని సినిమా పోస్టర్లను ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది. టిమ్ బర్టన్ క్లాసిక్ అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. కానీ మీరు పోస్టర్లను గురించి ఆలోచిస్తే జానీ డిప్ బెస్ట్ రాబర్ట్ స్మిత్ ఇంప్రెషన్లో వుంటాయి. ఈ పోస్టర్స్ చాలా గొప్పవి. ఇవి. పేరుతో పాటు కత్తెరలో రెండు జంటలు ఉంటాయి. ఇంకా దగ్గరగా చూస్తే ఈ ఇంప్రెషన్ జడ్ లాగా కనిపిస్తుంది.
ద కలర్ ఆఫ్ మనీ (బిలియడ్స్): ఈ పోస్టర్ రెగ్యులర్ ఫార్ములాను ఫాలో అవ్వదు. ప్రస్తుతమున్న కలర్ స్కీమ్ ను సింపుల్ గా కనిపించే షేప్స్, ఉపయోగించిన టైటిల్ ఫాంట్ నార్మల్ గా ఉంటూ ఆసక్తికరంగా ఉండేలా చేశారు. దాన్ని బిలియడ్స్ బోర్లా చేశారు.
గుడ్ బాడ్ అండ్ ద అగ్లీ... - టోపీలు, మీసాలు, ముక్కుతో గ్రేట్ పోస్టర్‌ను తయారు చేశారు. ఈ పోస్టరు వాడిన కలర్స్ గ్రేన్స్, బ్యాక్ గ్రౌండ్స్ ఈ పోస్టర్ కు చాలా ఉపయోగపడ్డాయి.
టైటానిక్: దీన్ని చూస్తే ఎంత గొప్ప పోస్టరో అర్థం అవుతుంది. ముందు చూసినప్పుడు అదేదో ఐస్ ముక్కలాగా కనిపిస్తుంది. నిదానంగా చూస్తేగానీ అర్థం కాదు. రెండు మైల్డ్ బ్లూ కలర్స్ తో క్రియేట్ చేసిన ఈ పోస్టర్ చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. రెండు మైల్డ్ బ్లూ కలతో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ చూస్తే షిప్ సముద్రంలోపల వున్నట్టు ఇట్టే తెలిసిపోతుంది.
సినిమా పోస్టర్లు ప్రేక్షకులను సినిమా థియేటర్‌కు రప్పించడానికి వాడే ముఖ్యమైన అస్త్రాలు. పోస్టర్లను డిజైన్ చేసేటప్పుడు కొద్దిపాటి గైడ్ లైను ఉపయోగిస్తే మీ సినిమా వెరైటీగా ఉంటుంది అనే ఫీలింగ్ ను ప్రేక్షకులపై కలిగించవచ్చు. చాలా మంది గ్రాఫిక్స్ ను ఉపయోగిస్తూ హీరోలను చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పోస్టర్లు డిజైన్ చేస్తుంటారు. సినిమా కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు తెలియజేయడానికి పెద్ద ఆసక్తి చూపించడంలేదు. కాబట్టి ఇక్కడ కొన్ని క్రియేటివ్ పోస్టర్లను సమీక్షించాం.
1958 అటాక్స్ ఆఫ్ ది 50 ఫీట్ ఉమెన్ చిత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ చిత్రం పోస్టర్ ఇప్పటికీ గుర్తుంటుంది. రెనాల్స్ బ్రౌన్ ఈ పోస్టర్‌ను సృష్టించడానికి చాలా కష్టపడ్డారు. అప్పట్లో విపరీతంగా టెలివిజన్ మోజులో ఉండే టీనేజర్ను థియేటర్లవైపు మళ్లించడానికి ఈ పోస్టర్ చాలా ఉపయోగపడినట్లు సమాచారం.
ద సిన్ ఆఫ్ నోరా మోరన్:
కొన్ని గొప్ప పోస్టర్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. 1933లో డిజైన్ చేసిన ద సిన్ ఆఫ్ నోరా మోరన్ పోస్టర్ మరపురాని కళాత్మకంగా రూపొందించబడింది. సాధారణంగా హాలీవుడ్లో కథలోని కీలక క్షణాన్ని పోస్టర్ ద్వారా తెలియజెప్పటానికి పోస్టర్‌ను ఆశ్రయిస్తారు. హీరో చేసే హైలైట్సను పోస్టర్ పై చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా వారి నైపుణ్యాన్ని చూపుతూ ఆ పోస్టర్ ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మేకర్ పై ఉంది. కొన్ని కీ పాయింట్స్ ఎలివేట్ చేసినప్పుడే ఆ పోస్టరు వేల్యూ వస్తుంది. గత శతాబ్దం నుంచి క్లాసిక్ పోస్టర్లుగా ఎంపిక చేసిన వాటిని గమనించి మనం అర్థం చేసుకోవచ్చు.
ఔట్ ఆఫ్ ది ఆషెస్: సాఫీగా సాగే ఈ సినిమాలో క్లైమాక్స్ ను పెయింట్ చేసి ఆడియెన్సను ఆకర్శిచడానికి పోస్టర్ డిజైనర్ ప్రయత్నించారు.
రిచర్డ్ 111: రిచర్డ్ మారణ హెూమానికి ముందు ఏర్పడే సంఘటన నను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది షేక్స్ పియర్స్ నాటకానికి వర్ణన
ది బాటిల్ ఆఫ్ ఎల్డర్ బుష్ గుల్స్: 1914లో ఇది మాస్ ప్రేక్షకులను ఆకర్శిస్తూ చేసిన తొలి పోస్టర్ ఇదే కావటం విశేషం.
డాంటేస్ ఇనెర్నో: ఈ పోస్టర్‌ను నిశితంగా గమనిస్తే సినిమాలో అత్యంత కీలక సన్నివేశం. ఆ సన్నివేశాన్ని పెయింట్ చేసి చూపరులను ఆకట్టుకున్నాడు పోస్టర్ మేకర్.
ది డార్క్ నైట్: మార్కెటింగ్ కాంపైన్ మొత్తం జోకర్ కేరెక్టర్ ను రివీల్ చేయకుండానే ప్రమోషన్ చేశారు.
300: స్టైలింగ్ ఆఫ్ ఫిల్మ్ ను గ్రేట్ ఆర్ట్ ను రూపొందించారు. కొన్ని సన్నివేశాలను కామిక్ బుక్స్ నుంచి సంగ్రహించినా, ఈ పోస్టర్లు విశేష ఆదరణ పొందాయి.
లిటిల్ మిస్ సన్ షైన్: ఈ పోస్టర్ సినిమాలోని ఒక అందమైన సన్నివేశానికి మద్దతునిస్తుంది. క్యూట్ గా వుండే ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ లో ఇలాంటి పోస్టర్లకు మంచి ఆదరణ ఉంది.
పోస్టర్స్ పై హీరో అక్కినేని నాగార్జున చాలా శ్రద్ధ చూపిస్తారు అని విజువల్ డిజైనర్ రమణ చెప్పారు. తను కాన్సెప్ట్ డిజైన్ చేసిన సినిమాల గురించి చెబుతూ' నేను డిజైన్ చేసిన పోస్టర్లలో ’ఢమరుకం‘ టైంలో నాగార్జున గారిలో పోస్టర్ లో కథ చెప్పాలి అనే కోరిక నాకు బాగా నచ్చింది. పోస్టర్లపై ఆయనకున్న అవగాహన చూసి ఆశ్చర్యపోయాను. రాజన్న పోస్టర్ కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు పోస్టర్ లో రాజన్న కనిపించాలి నేను కనిపించకపోయినా పరవాలేదు అన్నారు. అప్పుడు రాజన్న డప్పు వాయిస్తుంటే వెనుక ఊరిజనం వున్నట్టు డిజైన్ చేశాం. అంటే ఇక్కడ రాజన్న డప్పు వాయించి ఊరి జనాన్ని ఉత్తేజపరిచారని అర్థం. అలాగే ఢమరుకం కాన్సెప్ట్ డిజైన్ చేసినప్పుడు పోస్టర్ లో ఢమరుకం పెద్దగా కనిపించేలా కాన్సెప్ట్ డిజైన్ చేశాను అన్నారు.ఇలా సినిమా నిర్మాణానికి ముందు సినిమా కాన్సెప్ట్ ను ద్రుష్టిలో వుంచుకొని సినిమా కథ మొత్తం ఒక పోస్టర్ లో చెప్పేలా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రేక్షకుల్లో సినిమాను చూసే తీరు మారుతోంది అని చెప్పారు.
Social Plugin