G-N7RFQXDVV7 రాజేష్ టచ్ రివర్ ప్రొఫైల్ లో ‘దహిణి’ అనే మరో వివాదస్పద చిత్రం

Ticker

6/recent/ticker-posts

రాజేష్ టచ్ రివర్ ప్రొఫైల్ లో ‘దహిణి’ అనే మరో వివాదస్పద చిత్రం




జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్ రివర్ ప్రస్తుతం మరో వినూత్న కథాంశాన్ని స్రుశించారు.  విచ్ హంటింగ్  పేరుతో ఇప్పటికీ పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావలనే ప్రయత్నంతో ‘దహిణి’ అనే వివాదస్పదమైన అంశాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది. మొదట్నుంచి రాజేష్ టచ్ రివర్ నిజ జీవితంలో జరిగిన యథార్థసంఘటనలను సినిమాలుగా తెరకెక్కించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఒరిస్సా లోని మయూర్ బంజ్ జిల్లా,  పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటనను వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కించారు. ఈ కథను అధ్యయనం చేస్తున్న సమయంలో తెలిసిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, భారతదేశంలో 2001 నుంచి 2019 మధ్య దాదాపుగా 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి గ్రామస్థులందరూ కలిసి అత్యంత కిరాతంగా చంపారు. దానిపై ఎలాంటి కేసు లేదనే చెప్పాలి. 2021 ఒడిశా హైకోర్టు ప్రకారం, ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్య చేయబడ్డారు అన్నది రుజువవుతోంది. ప్రభుత్వ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఇందులో మహిళలే ఎక్కువ శాతం వున్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ కాలంలో భారతదేశంలో దాదాపు 25000 మంది మహిళలను 1987 నుంచి 2003 మధ్యన  మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది.  భారత దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న ఈ సమస్యను వెలుగులోకి తెచ్చి మానవ హక్కుల ఆందోళన, మరియు  లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ, రాజేష్ టచ్ రివర్  ఒక అద్భుతమైన సినిమాను రూపొందించారు. ‘దహిణి’ (ది విచ్) పేరుతో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి తన్నిష్ఠ ఛటర్జీ ప్రధాన పాత్ర పోషించారు. ప్రముఖ హీరో జె డి చక్రవర్తి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్‌ మరియు దత్తాత్రేయ తో సహా ప్రతిభావంతులైన తారాగణం  నటిస్తున్నారు..పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు మానవతావాది సునీత కృష్ణన్ చిత్ర నిర్మాత ప్రదీప్ నారాయణన్ తో కలిసి  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి 

సినిమాటోగ్రాఫర్ నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు, సౌండ్ డిజైనర్ అజిత్ అబ్రహం జార్జ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జార్జ్ జోసెఫ్, ఎడిటింగ్ శశి కుమార్,మాటలు: రవి పున్నం, స్పెషల్ మేకప్ డిజైన్ ఆర్టిస్ట్:  ఎన్‌జి రోషన్,, పాటకు సంగీతాన్ని  డాక్టర్ గోపాల్ శంకర్‌ అందిస్తున్నారు. వీరితో సహా అవార్డు గెలుచుకున్న సాంకేతిక సిబ్బంది సాంకేతిక సహకారాన్ని అందించారు.

"ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను ఆచరిస్తున్నాము. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాన్ని అంగీకరించక పోవడం మన దురద్రుష్టం. ఈ వాస్తవికతను బహిర్గతం చేయడానికి మరియు అలాంటి శతాబ్దాల క్రూరత్వాన్ని అంతం చేయడానికి సమిష్టి స్వరాన్ని సృష్టించడానికి ఈ చిత్రం మా ప్రయత్నం ”అని మానవ హక్కుల కార్యకర్త మరియు ఈ చిత్రాన్ని నిర్మించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ అన్నారు.

‘అమాయకులైన వేలాది మంది మహిళలను ఇప్పటికీ మన దేశంలోని పలు ప్రాంతాలలో విచ్ హంటింగ్ పేరుతో అమానుషంగా  ఎలా మట్టుపెడుతున్నారు? అనే క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ఒక అద్భుతమైన  ప్రయత్నంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో భాగం కావడం నా అద్రుష్టం’ అని మరో నిర్మాత ప్రదీప్ నారాయణన్ చెప్పారు.

ఈ చిత్రం ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజేష్ టచ్ రివర్,  పి.ఆర్.ఓలుగా నాయుడు - ఫణి వ్యవహరిస్తున్నారు.