1955వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు.. మొగుల్తూరు నుంచి పాలకొల్లు వెళ్లే బాట. బాటకి ఇరువైపులా పంటచేలు.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ బాట మీద ఓ గుర్రపు బండి వెళుతోంది. బండిలోని భార్యాభర్తలిద్దరూ పాలకొల్లులో అర్ధాంగి సినిమా చూడడానికి బయల్దేరారు. బండిలో ఉన్న ఆవిడ నిండు గర్భిణి. ఓ మలుపు దగ్గర బండరాయి మీదకి ఎక్కి బండి తూలడంతో బండిలోని స్త్రీ కింద పడిపోవడం.. పరుగు పరుగున భర్త భార్య దగ్గరకు వచ్చి పట్టుకుని నీకేమి కాలేదు కదా నీవు కులాసానా..? అని ప్రశ్నిస్తే నాకేం ఫర్వాలేదు ముందు కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉన్నాడో..? అని గాభరాగా హాస్పటల్ కు వెళ్లి డాక్టరు ఏమీ ఫరవాలేదు అని చెప్పాకా ఆ తల్లి ఊపిరి పీల్చుకుందట.
ఆ కన్నతల్లి కడుపు తీపి నేడు కోట్లాది మంది ప్రేక్షకుల కళ్లల్లో కాంతులీనుతూ కనిపిస్తుంది. ఆ బండిలో ప్రయాణించిన భార్యభర్తలు శ్రీమతి అంజనాదేవి, శ్రీ వెంకట్రావు. తన కడుపులోని బిడ్డ ఏమయ్యాడోనని అంజనాదేవి తల్లడిల్లేట్టు చేసిన ఆ ప్రధమ గర్భస్థ శిశువు శివ శంకర్ వర ప్రసాద్. అతడే మెగాస్టార్ చిరంజీవి. పెనుగొండలో పోస్ట్ మేన్ గా జీవితం మొదలుపెట్టి పోస్ట్ మాస్టర్ గా రిటైరైన కొణిదెల సూర్యప్రకాశరావు గారి వంశవృక్షం నుండి మొలకెత్తిన మహావృక్షమే మెగాస్టార్ చిరంజీవి. సూర్యప్రకాశరావు గారబ్బాయి కొణిదెల వెంకట్రావు. కొణిదెల వెంకట్రావు నెల్లూరుకు చెందిన మేనమామ జె.ఆర్.కె నాయుడు గారి కుమార్తె అంజనాదేవిని ఇష్టపడడం.. పెద్దలు అంగీకరించడం జరిగింది. ఉద్యోగారీత్యా గోదావరి జిల్లాలకి అప్పటికే వచ్చి ఉండడంతో వీరిరివురి వివాహం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అత్యంత వైభవంగా జరిగింది.
పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించిన వెంకట్రావు మొగల్తూరులో ఉండగానే తండ్రయ్యారు. 1955వ సంవత్సరం ఆగష్టు 22న తేదీన ఉదయం 10.05 నిమిషాలకు శివ శంకర్ వర ప్రసాద్ నర్సాపూర్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. వెంటనే వెంకట్రావుకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడం జరిగింది. నెల్లూరు తాత జె.ఆర్.కె నాయుడు శివ శంకర వర ప్రసాద్ అని చిరంజీవికి నామకరణం చేసారు. ఆయన ఈశ్వర భక్తుడు. అప్పట్లో మొగల్తూరులో శివ శంకర్ వర ప్రసాద్ పేరిట రైస్ మిల్ ని కూడా నడిపారాయన.
అంతే కాదండోయ్.. ఆ చుట్టు ప్రక్కల బావి లేకపోతే చిరంజీవి పేరిట బావి త్రవ్వించడం.. నీళ్లు పడడంతో శివ శంకర్ వర ప్రసాద్ మహా జాతకుడని.. చిరంజీవి భవితవ్యం దేదీప్యమానమై ఎందరికో ఆదర్శవంత మౌతుందని అంచనా వేసిన మహానుభావుడు జె.ఆర్.కె నాయుడు. శివ శంకర్ వర ప్రసాద్ అక్షరాభాస్యం జరిగింది కూడా శివుడి గుడిలోనే. నిడదవోలులోని శివుడి గుడిలో పిక్కపాశం పంతులనే పంతులు గారి దగ్గర మొట్ట మొదటిగా బాల చిరంజీవి ఓం నమః శివాయ అంటూ అక్షరాభ్యాసం చేసారు.
బాల చిరంజీవిని తొలిసారి ఫోటో తీయించింది కూడా జె.ఆర్.కె నాయుడే. నెలల బిడ్డగా ఉన్న శివ శంకర్ వర ప్రసాద్ ని నర్సాపురంలో ఉన్న ఫోటో స్టూడియోకి సుమారు 7 కిమీ ఎత్తుకొని వెళ్లి ఫోటో తీయించారు. బాల్యం నుంచే చిరంజీవి పుట్టినరోజును వేడుకగా జరిపేవారు. ఇంటి దగ్గర మైక్ సెట్ పెట్టి చుట్టుప్రక్కల పేరంటాల్ని పిలిచి కానుకలిచ్చి హడావిడి చేసేవారు. అలానే నేటికీ మెగా లెవల్లో బర్తడే ఫంక్షన్స్ కంటిన్యూ అవుతుండడం దైవ నిర్ణయం. నిడదవోలు శివుడి గుడిలో అ ఆ లు దిద్దాకా వెంకట్రావు కుటుంబం నిడదవోలు నుంచి గురజాలకు ట్రాన్సఫర్ అయ్యింది.
గురజాలలో మళ్లీ అ ఆ లు దిద్దిన బాల చిరంజీవి గురజాల నుంచి మంగళగిరి, మంగళగిరి నుంచి పొన్నూరు వచ్చారు. మధ్యలో ఒక్కొక్కసారి మాత్రం మొగుల్తూరుకు వచ్చి 7వ తరగతి అక్కడే చదివాడు బాల చిరంజీవి. తొమ్మిదో తరగతి అంతా పొన్నూరులోనే. తిరిగి పదో తరగతికి మొగల్తూరు వచ్చి చదువుకున్నాడు. 10వ తరగతి చదువుతూ పెనుమత్స రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్ లో బాల చిరంజీవి స్నేహితుడు వ్రాసిన పరంధామయ్య పంతులు నాటకం టైటిల్ రోల్ ధరించి బెస్ట్ యాక్టర్ బహుమతి ఫస్ట్ టైమ్ అందుకొని భవిష్యత్తుని అంచనా వేసేసాడు బాల చిరంజీవి ఆనాడే..!
Social Plugin